Amaravathi:The AP government has been working to provide awareness among the people on the solar power. For that AP Government has set up experimental solar trees in the Secretariat premises.
ఎన్నటికి తరగని అసాధారణ శక్తి సౌర శక్తి...ఈ నేపథ్యంలో అద్భుతమైన సౌర శక్తిని ఉపయోగించుకునే విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎపి ప్రభుత్వం నడుంబిగించింది. సోలార్ పవర్ వినియోగం కోసం ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చెట్లు విదేశాల్లో సైతం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటి ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఎపి ప్రభుత్వం దూరదృష్టిపై సర్వత్రా అభినందనలు వెల్లివిరుస్తున్నాయి.
నవ్యాంధ్ర రాజధాని వెలగపూడి లోని ఎపి సెక్రటేరియట్ ప్రాంగణంలో నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో సూర్య పవర్ ట్రీ కంపెనీ ప్రయోగాత్మకంగా 2 సోలార్ చెట్లను ఏర్పాటు చేసింది.
ఈ సోలార్ ట్రీ ఒక్కో చెట్టు ఎత్తు 20 అడుగులు. ఏడాదికి 18 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన వీటిని అతి తక్కువ స్థలంలో...కేవలం 12 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. ఇక ఈ ట్రీ పనితీరు విషయానికొస్తే దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసేంత విద్యుత్తును ఈ సోలార్ చెట్టు పది చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ ఉత్పత్తి చేస్తుంది.
సాధారణ చెట్ల మాదిరిగానే దీంట్లో ఒక బలమైన లోహపు కాండం ఆధారంగా కొన్ని కొమ్మల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిపై సోలార్ ప్యానెల్స్‌ను బిగిస్తారన్నమాట. ఒక్కో సోలార్ చెట్టుతో దాదాపు 5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు.వీటితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో దిగువన ఉన్న స్మార్ట్ టచ్ స్క్రీన్ మానిటర్లు పనిచేస్తాయి. అలాగే ప్యానెల్స్‌పై పడే దుమ్మూ ధూళిని ఎప్పటికప్పుడు కడిగేసేందుకు దీంట్లో ఓ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉంది.
ఎపిలోనే తొలి సోలార్ ట్రీని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి కారణం...రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, సందర్శకులు వస్తుంటారని...ముందుగా వారికి వీటిపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.