Telangana Chief Minister K Chandrashekhar Rao met West Bengal Chief Minister Mamata Banerjee in Kolkata to build efforts for formation of a non-Congress, non-BJP third front before 2019 elections
ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో చర్చించానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేసీఆర్-మమతలు దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సాయంత్రం ఐదున్నరకు ఇరువురు మీడియాతో మాట్లాడారు. దేశం మార్పు కోరుకుంటోందని చెప్పారు. ఒకే పార్టీ దేశాన్ని పాలిస్తుందని అనుకోవద్దని ఆమె వ్యాఖ్యానించారు.
తాము బలమైన ఫెడరల్ ఫ్రంట్ కోరుకుంటున్నామని మమతా బెనర్జీ చెప్పారు. కలిసి వచ్చే మిగిలిన పార్టీలతో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఫ్రంట్ భిన్నమైనదని అభిప్రాయపడ్డారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని కేసీఆర్ అన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పూర్తిగా భిన్నమైనదని చెప్పారు. ఇప్పుడు రియల్ ఫెడరల్ ఫ్రంట్ అవసరమన్నారు.
ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనని కేసీఆర్ అన్నారు. కలిసి వచ్చే పార్టీలతో తాము చర్చలు జరుపుతామన్నారు. మమతా బెనర్జీతో భేటీ తొలి అడుగు అన్నారు. తాము రియల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
త్వరలో అజెండా ఉంటుందని, తమ అజెండా బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌లదిగా ఉండదని, ప్రజల అజెండాగా ఉంటుందని చెప్పారు. రొటీన్ పొలిటికల్ పార్టీల్లా ఉండదని చెప్పారు. ఇది మంచి ప్రారంభమని, రాజకీయాలు కంటిన్యూ ప్రాసెస్ అన్నారు.