IPL 2018 Launched in a grand manner Starred with Tamanna, prabhu deva in medley dance.
క్రికెట్ మహోత్సవం ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. క్రికెట్లో ప్రపంచకప్, టీ20 కప్ ఎలాగ ప్రత్యేకమో... ఐపీఎల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. ఐపీఎల్ అంటేనే హోరెత్తించే పాటలు.. అందుకు తగ్గట్టుగా చీర్ లీడర్ల నృత్యాలు.. సూపర్ ఓవర్లు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉంటాయి.
అలాంటి ఐపీఎల్ మరికొద్ది గంటల్లో ముంబైలోని వాంఖడె స్టేడియంలో ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆరంభ వేడుకలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు తమ డ్యాన్స్‌లతో అభిమానులను కనువిందు చేయనున్నారు. గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్ తారలు తళుక్కుమనబోతున్నారు.
హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నృత్యాలతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే వేదికపై పది నిమిషాలపాటు ప్రదర్శన ఇచ్చేందుకు తమన్నా రూ.50 లక్షలు పారితోషికం తీసుకుందట. ఇప్పటికే ఐపీఎల్ ఆరంభ వేడుకల కోసం తమన్నా డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు తమన్నా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో కలిసి లైవ్ ప్రదర్శన ఇవ్వనుంది. వీరిద్దరి జోడీ తెలుగు, తమిళ్, కన్నడ మెడ్లీకి డ్యాన్సులు చేయనున్నారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ షయామక్ ధావర్ ఈ మెడ్లీకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా తమన్నా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో 'నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి వేడుకల్లో ప్రదర్శన ఇవ్వలేదు. ఇలాంటి వేదికలపై ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆహూతుల ఉత్సాహం, సంతోషం చూడటం చాలా విభిన్నమైన అనుభూతి. ఐపీఎల్‌లో ప్రదర్శన ఇస్తుండటం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని పేర్కొంది. ఈ ఆరంభ వేడుకల అనంతరం చెన్నై, ముంబై మ్యాచ్ మొదలవుతుంది.